– పేదల అభ్యున్నతే లక్ష్యం
– రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్..
– హిమాచల్ ప్రదేశ్ లలో కులగణన
– వెనుకబడిన వర్గాలకు ప్రయోజనమే ధ్యేయం
– బీజేపీ మౌనమెందుకన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణనను నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలో పేదల దాస్య విముక్తికి ఇది ఒక ప్రగతి శీల నిర్ణయమని పేర్కొన్నారు.
కులగణన విషయంలో కాంగ్రెస్ కమిట్ మెంట్ తో ఉందని స్పష్టం చేశారు. తమ ముఖ్యమంత్రులు రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ లల్లో కులగణన చేపట్టేందుకు నిర్ణయించారని అన్నారు. మతం లేదా కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కేవలం దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చడమే తమ ధ్యేయమని తెలిపారు రాహుల్.
కేంద్రం కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. నలుగురు సీఎంలు వున్న తమ పార్టీ చేపట్టాలని నిర్ణయం తీసుకుందని.. బీజేపీలో పది మంది ముఖ్యమంత్రులు వున్నారని కానీ ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. కులగణనకు ‘ఇండియా’ కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఇది కేవలం సామాజిక న్యాయం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయమని వివరించారు.
కుల గణనను చేపట్టేలా బీజేపీపై తాము ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. ఒకవేళ కులగణనకు బీజేపీ ఒప్పుకోలేదంటే ఈ విషయంలో నాయకత్వం వహించే అవకాశాన్ని కాంగ్రెస్ కు ఇవ్వాలన్నారు రాహుల్ గాంధీ.