ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్ నాథ్ (Kedarnath) ఆలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సందర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ చేరుకున్నారు. రాజధాని డెహ్రడూన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆలయం వద్దకు చేరుకున్నారు.
మొదట ఆయనకు ఆలయం వద్ద కాంగ్రెస్ నేతలు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన చాయ్ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఛాయ్ సేవలో భాగంగా భక్తులకు రాహుల్ గాంధీ టీ అందజేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తికనబరిచారు. రాహుల్ గాంధీని ఎప్పుడూ టీవీలో చూస్తు ఉంటామని, మొదటి సారి ప్రత్యక్షంగా చూస్తున్నామని, చాలా సంతోషంగా ఉందని పలువురు భక్తులు వెల్లడించారు.
తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా వుంటే ఇటీవల భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన రైతులు, ట్రక్కు డ్రైవర్లు, వ్యాపారులు, రైల్వే స్టేషనల్‌లో కూలీలను కలిశారు.