చత్తీస్ గఢ్ (Chattisgadh) లో మరో ప్రతిష్టాత్మక పథకాన్ని కాంగ్రెస్ (Congress) ప్రారంభించనుంది. బిలాస్ పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ న్యాయ యోజనా ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
ఈ పథకం కింద లబ్దిదారులకు మొదటి విడత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ పంపిణీ చేయనున్నారు. మొదటి విడత కింద లబ్దిదారులకు రూ. 25000లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,30,000 మంది లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేశారు. బిలాస్ పూర్ జిల్లాలోని సాక్రి గ్రామంలో తక్త్ పూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
మొత్తం 1.30 లక్షల మంది లబ్దిదారుల్లో 1 లక్ష మందిని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పర్మినెంట్ వెయిటింగ్ లిస్టులో పెట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి నిర్మాణ్ శ్రామిక్ ఆవాస్ సఖ్యత యోజనా కింద 500 మంది లబ్దిదారుల అకౌంట్లలో రూ. 5 కోట్లు జమచేయనున్నారు. ఈ ఏడాది మే నెలలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ పథకం కింద నమోదు చేసుకున్న చత్తీస్ గఢ్ బిల్డింగ్, నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. దీంతో పాటు బిలాస్ పూర్ జిల్లాలో రూ. 524.33 కోట్లు విలువ చేసే పలు అభివృద్ది పనులను రాహుల్ గాంధీ, భూపేశ్ బాఘేల్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో నూతనంగా నియమితులైన 2594 మంది ఉపాధ్యాయులకు అపాయింట్ మెంట్ లెటర్లు అందించనున్నారు.