కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని క్రితి నగర్ ఫర్నీచర్ మార్కెట్ (Furniture Market) కు వెళ్లారు. అక్కడ కార్పెంటర్లను కలిసి ముచ్చటించారు. వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ షేర్ చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాను ఫర్నీచర్ మార్కెట్ కు వెళ్లిన విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. తాను ఆసియాలోనే అత్యంత పెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని క్రితి నగర్ మార్కెట్ కు వెళ్లినట్టు చెప్పారు. అక్కడ కార్పెంటర్ సోదరులతో ఇంటరాక్ట్ అయినట్టు తెలిపారు.
వాళ్లు కష్టపడే స్వభావం గల వారనీ, అంతకు మించి గొప్ప పనితనం కలవారని ఆయన కొనియాడారు. వాళ్లను కలిసిన ఫోటోలను రాహుల్ గాంధీ షేర్ చేశారు. వాళ్లతో తాను చాలా సమయం పాటు సంభాషించానన్నారు. ఆ సమయంలో వారి నైపుణ్యాల గురించి కొంచెం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పాటు వాళ్ల నుంచి కొంచెం నేర్చుకునేందుకు ప్రయత్నించానన్నారు.
ఈ నెల 21న అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లోని రైల్వే కూలీలను రాహుల్ గాంధీ కలిశారు. రైల్వే కూలీలు ధరించే యూనిఫామ్ ధరించి వారితో ముచ్చటించారు. కాసేపు ప్రయాణికుల సూట్ కేసు మోశారు. ఈ సందర్బంగా కూలీలు తమ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లారు. తమ కూలీ రేట్లు పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.