పుణె ‘ఐసిస్’కేసులో ఎన్ఐఏ కీలక ఆధారాలను సేకరించింది. ఉత్తర రైల్వేకు చెందిన క్లర్క్ ఒకరు ఐసిస్‌కు నిధులు సమకూర్చినట్టు ఎన్ఐఏ (NIA) గుర్తించింది. సదరు ఉద్యోగి నకలి మెడికల్ బిల్లులు (Fake Medical Bills) క్లెయిమ్ చేసినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులను ఉగ్రసంస్థకు నిధులు సమకూర్చాడని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆ క్లర్క్ కోసం ఎన్ఐఏ వెతుకుతోంది.
వాంటెడ్ టెర్రరిస్టులు షానవాజ్ తో పాటు మరో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రలింకుల నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దీంతో క్లర్క్ బాగోతం బయటకు వచ్చింది. ఎన్ఐఏ విచారణలో ఉగ్రవాదులు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగిస్తోందని సమాచారం. సదరు క్లర్క్ నోయిడా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
నార్త్ రైల్వేలోని ఫైనాన్స్ విభాగంలో ఆయన పని చేస్తున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినట్టు పేర్కొన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 2న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ముగ్గురు ఐఎసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వారిలో మహ్మద్ షానవాజ్ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. విదేశాల్లోని ఐసిస్ సభ్యుల నుంచి వచ్చే సూచనల ఆధారంగా నార్త్ ఇండియాలో ఉగ్ర ఘటనలకు ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
షానవాజ్‌పై ఎన్ఐఏ రూ.3 లక్షల రివార్డు ప్రకటించింది. షానవాజ్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఢిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. పూణే పోలీసుల కస్టడీ నుంచి షానవాజ్ తప్పించుకున్నాడని సమాచారం. జూలై 17-18 అర్ధరాత్రి పూణే పోలీసులకు షానవాజ్ పట్టుబడ్డాడు. పూణెలోని కోత్రుడ్ ప్రాంతంలో మోటార్ సైకిల్ దొంగిలించే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు.