ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ(Telangana) లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు(3days rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లా యాదాద్రి నారాయణపురం మండలంలో 5.9 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరు మండలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మేడ్చల్- మల్కాజిగిరిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా రెండు రోజులుగా హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో వాతావరణం చల్లబడింది.
మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కూడా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని బాలానగర్, మూసాపేట్ సర్కిల్ పరిధిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.