రాజస్థాన్ (Rajasthan)లో పోలింగ్ (Polling) ప్రశాంతంగా జరుగుతోంది. 199 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా బారన్ ప్రాంతంలో 12.97 శాతం, దోలాపూర్లో 12.66 శాతం ఓటింగ్ నమోదైన్నట్టు వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో కేవలం ఒక కుటుంబం కోసం పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. పాక్ సరిహద్దుల్లోని బార్మర్ జిల్లా పార్క్ గ్రామంలో 35 మంది కోసం ఓ పోలింగ్ బూత్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ 35 మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. గతంలో పోలింగ్ నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు.
గతంలో ఈ గ్రామస్తులు ఓటు వేసేందుకు 20 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇది ఎడారి ప్రాంతం కావడంతో ఓటు హక్కు కోసం ఒంటెలపై లేదా కాలినడకన 20 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆ ప్రయాణం మహిళలకు, వృద్ధులకు సవాలుగా మారింది. కానీ ఈ ఏడాది ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వారికి ఇబ్బందులు తొలగిపోయాయి.
ఈ ఏడాది ఆ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఆ గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఆ గ్రామ ఓటర్లు సంతోషంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ గ్రామంలో 18 మంది పురుషులు, 17 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఇది ఇలా వుంటే ఈ ఎన్నికల్లో విజయంపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.