రాజస్థాన్ (Rajasthan)లో పోలింగ్ (Polling) ప్రారంభమైంది. మొత్తం 200లకు గాను 199నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కరన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మిత్ సింగ్ మరణించడంతో ఆ స్థానానికి ఎన్నికను వాయిదా వేశారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లలో బారులు తీరారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. లక్షా 70 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది. 2.74 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
కేంద్ర మంత్రి కైలాశ్ బైతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బల్టోరాలోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. రాజస్థాన్ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని తెలిపారు. 150కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి బావీ నియోజక వర్గంలో ఓటు వేశారు. బీజేపీ ఎంపీ, జోత్వారా నియోజక వర్గ అభ్యర్థి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ జోద్ పూర్ పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ బికనూర్ లో ఓటు వేశారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగడరం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ జైపూర్ లోని సివిల్ లైన్స్ ఏరియాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన టోంక్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
అంతకు ముందు రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ ఎన్నికల్లో మొదటి సారి ఓటు హక్కు పొంది తమ తొలి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న యువతీ-యువకులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.