ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender). మెదక్ (Medak) వెళ్తుండగా.. బొల్లారం వద్ద సంగారెడ్డి (Sangareddy) జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే, గుమ్మడిదల చెక్ పోస్ట్ వద్ద మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ వెల్ కమ్ చెప్పారు. బీజేపీ శ్రేణులు రాజేందర్ పై పూలు జల్లుతూ స్వాగతం పలికారు. ఆ తర్వాత నర్సాపూర్ (Narsapur) లో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు ఈటల.
రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారు.. ఎన్ని కట్టారు, ఎన్ని పేదలకు పంచారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రం, పంట పొలాలకు నీళ్లు రావాలని ప్రాజెక్టులే ప్రధమ కర్తవ్యం అని చెప్పారని గుర్తు చేశారు. రెండోసారి అధికారం ఇస్తే బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని అన్నారని.. సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ వంద ఇళ్లు కట్టి.. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు పెట్టి.. ఇలాంటి ఇళ్లే కట్టిస్తామని నమ్మబలికారని వివరించారు.
2.91 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. లక్ష ఇళ్లు కట్టి ఉండొచ్చని.. వాటిలో కూడా ప్రజలకు పంచినవి 30 వేలకు మించి ఉండవన్నారు రాజేందర్. ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని తెలిపారు. ఇందులో 9వేల కోట్ల రూపాయలు కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థ నుంచి వచ్చినవేనన్న ఆయన.. కేంద్రం నేరుగా మరో రూ.1,311 కోట్లు ఇచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో రూ.580 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది 600 కోట్లకు మించి ఉండదని.. మిగిలనదంతా కేంద్రం ఇచ్చిన డబ్బులేనని తెలిపారు.
నర్సాపూర్ లో 500 ఇళ్లు మంజూరు చేస్తే 2 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని.. ఇంతమందికి అవి సరిపోవని స్థానిక ఎమ్మెల్యేనే వాపోయారని అన్నారు. ఏడేళ్ల క్రితం మొదలుపెట్టిన ఇళ్లు ఇంకా పూర్తి కాలేదని.. ఐరన్ తుప్పుపట్టింది.. సెంట్రింగ్ పాడయింది.. ఈ మధ్య కూలీలు పెట్టి హడావుడి చేస్తున్నారని చెప్పారు. మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని.. ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ మాటలు కోటలు దాటతాయని చేతలు మాత్రం గడప దాటవని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సొంత ఇంటి కల నెరవేరదన్న ఆయన.. మోడీ నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇచ్చామని వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సొంతింటి కల నెరవేరుస్తామన్నారు. నర్సాపూర్ నుంచి మెదక్ వెళ్లిన రాజేందర్.. బీజేపీలోకి చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు.