షహీద్ రాజేంద్రనాథ్ లాహిరి (Rajendra Nath Lahiri)…. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) సభ్యుడు. జమిందారి కుటుంబంలో పుట్టినప్పటికీ తన సంపదలన్నింటినీ కాదనుకుని విప్లవ పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి. కకోరి కుట్రకేసు, దక్షిణేశ్వర్ బాంబు కేసుల్లో సూత్రధారి. కోర్టు నిర్ణయించిన తేదీ కన్నా ముందే ఆయన్ని ఉరి తీశారంటే ఆయన ఎలాంటి పోరాట యోదుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
23 జనవరి 1901న బెంగాల్ ప్రెసిడెన్సీలోని పాబ్నా (నేటి బంగ్లాదేశ్)లో జన్మించారు. వాళ్లది బెంగాల్ ప్రెసిడెన్సీలోనే సంపన్న జమిందారీ కుటుంబం. అక్కడ మాస్టర్స్ చేస్తున్న సమయంలో షహీద్ సచింద్ర సన్యాల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆయన జీవితాన్నే మార్చి వేసింది. సచింద్ర సన్యాల్ స్ఫూర్తితో విప్లవ కార్యకలాపాల వైపు ఆయన ఆకర్షితులయ్యారు.
బంగ వాణి అనే పత్రికకు రాజేంద్ర లాహిరిని కో ఆర్డినేటర్‌గా సచింద్ర సన్యాల్ నియమించారు. ఆ తర్వాత అనుశీలన్ సమితి వారణాసి శాఖకు ఆయుధాల ఇంఛార్జ్ గా ఆయన పని చేశారు. అనంతరం హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు. అప్పుడే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయాలని ప్రణాళికలు రచించారు.
బ్రిటీష్ ప్రభుత్వ ఖజానాపై దాడులు చేసి దోచుకున్నారు. అందులో 1925లో జరిగిన కకోరి కుట్ర కేసు ప్రధానమైనది. రాం ప్రసాద్ బిస్మల్, అశ్వఖుల్లా ఖాన్ తో కలిసి కకోరి కుట్ర కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ఈ దోపిడీ తర్వాత బాంబుల తయారీలో శిక్షణ పొందేందుకు ఆయనతో పాటు పలువురు విప్లవకారులు దక్షిణేశ్వర్ బాంబుల ఫ్యాక్టరికి వెళ్లారు. అక్కడ బాంబుల తయారు చేస్తున్న సమయంలో పెద్ద పేలుడు సంభవించింది.
ఈ క్రమంలో రాజేంద్ర లాహిరితో పాటు మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు పదేండ్ల జైలు శిక్ష పడింది. ఆయన్ని అండమాన్ జైలు నుంచి లక్నో సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరి కొంత సమయం దొరికితే విప్లవకారులు మరోసారి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు భావించారు. శిక్ష సమయం కన్నా రెండు రోజుల ముందే రాజేంద్ర నాథ్ లాహిరిని ఉరితీశారు.