రాజ్య సభ హక్కుల కమిటీ (Rajya Sabha’s privileges committee) సమావేశాన్ని (meeting) శుక్రవారం నిర్వహించనున్నారు. ఎగువ సభలో సభ్యులపై పెండింగ్ లో ఉన్న సభా హక్కుల ఉల్లంఘనల కేసులను పరిశీలించేందుకు రేపు కమటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.
విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను నిరవధికంగా సస్పెండ్ చేయడం ఆందోళన కలిగించే విషయమని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండట గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ లపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను ప్యానెల్ పరిశీలించనున్నట్టు సమాచారం.
రాజ్య సభ హక్కుల కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్టు రాజ్యసభ సచివాలయం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. కానీ సమావేశం ఎజెండాను మాత్రం సచివాలయం ప్రకటించలేదు. ఈ ఏడాది అగస్టు 11న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా సభా నియమాలను ఉల్లంఘించారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై రాజ్య సభ సభ్యులు ఐదుగురు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. సభలో పదే పదే నియమాలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెల్లడించారు. సభా హక్కుల కమిటీ తదుపరి నివేదిక వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. అదే సమయంలో టీఎంసీ ఎంపీపై మూడు ఫిర్యాదులు పెండింగ్ లో వున్నాయి.