ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (Paidi Rakesh Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మధ్య పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
మీడియాతో మాట్లాడుతూ….. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయం మెదలు పెట్టాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్, నారాయణ పేట్ ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లు ఎలా కేటాయిస్తారు? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రులు కేవలం వాళ్ల సొంత జిల్లాలకే మంత్రులా? లేకా రాష్ట్రానికి మంత్రులా? అని ప్రశ్నించారు.
అన్ని నిధులను కేవలం ఖమ్మం, నల్లగొండ జిల్లాలకే కేటాయిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నిధులను కేటాయించక పోతే ఉత్తర తెలంగాణ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.