నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కీలక ప్రతిపాదనలు చేసింది. రామాయణ (Ramayana), మహాభారత (Maha Baratha) కావ్యాలను చరిత్ర ప్యాఠ్యాంశాల్లో చేర్చి పాఠశాల విద్యార్థలకు బోధించాలని సూచనలు చేసింది. దీంతో పాటు పాఠశాలలోని అన్ని తరగతుల్లో గొడలపై రాజ్యాంగంలోని ప్రవేశికను అన్ని భాషల్లో రాయాలని ఎన్సీఈఆర్టీ ప్రతిపాదించింది.
ఇటీవల పాఠశాలల్లో సాంఘిక శాస్త్రాల పాఠ్యాంశాలను సవరించేందుకు ఎన్సీఈఆర్టీ ఒక సోషల్ సైన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. పాఠ్యపుస్తకాల్లో భారతీయ విజ్ఞాన వ్యవస్థ, వేదాలు, ఆయుర్వేదానికి సంబంధించిన పలు కీలక అంశాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెట్టాలని ప్రతిపాదనలు చేసింది. చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ఈ కమిటీ సూచనలు చేసింది.
ప్రస్తుతం చరిత్ర మూడు భాగాలుగా ఉంది. చరిత్రను ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర అనే మూడు భాగాలుగా విభజించారు. తాజాగా చరిత్రను నాలుగు భాగాలుగా విభజించాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. చరిత్రను సాంప్రదాయ కాలం, మధ్యయుగ కాలం, బ్రిటిష్ పాలనా కాలం, ఆధునిక భారతదేశాలుగా విభజించాలని పేర్కొంది.
ఇందులో సాంప్రదాయ కాలం (క్లాసికల్ పీరియడ్) కింద మహా కావ్యాలైన రామాయణ, మహాభారతాలను పొందు పర్చాలని వెల్లడించింది. శ్రీ రాముడు అంటే ఎవరు, రామాయణ ఉద్దేశం ఏంటనే విషయాల గురించి విద్యార్థులకు అవగాహన ఉండాలని ఈ మేరకు సిఫారసులు చేసినట్టు కమిటీ తెలిపింది. అందుకే రామాయణ, మహాభారత్‌లోని కొన్ని భాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించామని పేర్కొంది.