యోగా గురువు, పతంజలి (Pathanjali) ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబా (Ram Dev Baba)ను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే అడ్వర్ టైజ్ మెంట్లను ఆపి వేయాలని ఆయనకు సూచించింది. అలాంటి అసత్య, తప్పుదోవ పట్టించే అడ్వర్ టైజ్ మెంట్లను వెంటనే నిలిపి వేయాలని రామ్ దేవ్ బాబాను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అలాంటి ఉల్లంఘనను న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొంది. ఒక నిర్ధిష్టమైన వ్యాధిని నయం చేయగలదని తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతి హెర్బల్ ఉత్పత్తిపై రూ. 1 కోటి జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది. వ్యాక్సిన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్ దేవ్ బాబా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ గతేడాది అగస్టులో ఐఎంఏ పిటిషన్ దాఖలు చేసింది.
తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. తాము ఈ సమస్యను అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదగా మార్చాలని అనుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే అడ్వర్ టైజ్ మెంట్ల వల్ల కలిగే సమస్యకు సరైన పరిష్కారం కనుగోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
ఈ సమస్యను తాము సీరియస్‌గా తీసుకున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఆచరణీయమైన ఓ పరిష్కర మార్గాన్ని కనుగోవాలని అడిషనల్ సాలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ కు ధర్మాసనం సూచించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత తగిన ప్రతిపాదనలు చేయాలని కోరింది. అనంతరం కేసును ఫిబ్రవరి 5, 2024కు వాయిదా వేసింది.