బహుజన్ సమాజ్ వాది పార్టీ (BSP) ఎంపీ డానీష్ అలీ (Danish Ali)పై బీజేపీ ఎంపీ రమేష్ బిదూరీ (Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ఆయన వ్యాఖ్యలపై సమాజ్ వాది పార్టీ ఎంసీ ఎస్టీ హసన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారతీయ ముస్లింలను బీజేపీ బలిపశువుల్లాగా పరిగణిస్తోందని మండిపడ్డారు. దేశంలో ప్రయోగాలన్నీ ముస్లింలపైనే జరుగుతున్నాయన్నారు.
ఇటీవల తనను కూడా టార్గెట్ చేశారని ఆయన వాపోయారు. నువ్వు పాకిస్తాన్ ఎందుకు వెళ్లకూడదంటూ తనపై బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది ఇలా వుంటే నిన్న రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్బంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని తీవ్రవాది అంటూ బీజేపీ ఎంపీ రమేష్ బిదూరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశాయి.
ఎవరీ రమేష్ బిదూరీ….!
రమేష్ బిదూరీ చిన్న తనం నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పని చేశారు. కాలేజీలో విద్య అభ్యసిస్తున్న సమయంలో ఏబీవీపీ నేతగా పని చేశారు. 1983లో షహీద్ భగత్ సింగ్ కాలేజ్ సెంట్రల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తుగ్లకాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించ లేకపోయారు.
ఆ తర్వాత 1998లో మరోసారి అదే నియోజ వర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2008లో మరోసారి తుగ్లకాబాద్ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. అనంతరం 2009 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత 2014, 2019లో వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.
గతంలో పలు వివాదాలు….!
ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఎంపీ రమేష్ బిదూరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఓ మరుగుజ్జు దుర్యోధనుడు అంటూ రమేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇక గతంలో తమను రమేష్ బిదూరీ తీవ్రంగా దూషించారంటూ మహిళా ఎంపీలు రంజిత్ రంజన్ (కాంగ్రెస్), సుస్మితా దేవ్ (గతంలో కాంగ్రెస్) సుప్రియా సూలే (ఎన్సీపీ), అర్పితా ఘోష్ (తృణమూల్ కాంగ్రెస్), పీకే శ్రీమతి టీచర్ (సీపీఎం)లు అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఫిర్యాదు చేశారు. ఇక 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై రచ్చ జరిగింది.