ఛత్రపతి శివాజీ (Shivaji) మహరాజ్ తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశారు. బీజాపూర్, గోల్కొండ, మొఘల్ సుల్తాన్ లకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసి అపూర్వ విజయాలను సాధించారు. కానీ ఈ విజయాల వెనుక ఉన్న రామ్ జీ పంగేరా ( Ramaji Pangera) గురించి చాలా మందికి తెలియదు. ప్రతాప్ గఢ్‌తో పాటు పలు యుద్దాల్లో పాల్గొని శివాజీకి అద్భుతమైన విజయాలను అందించారు.
ఛత్రపతి శివాజీ సైన్యంలో రామ్ జీ పంగారే కమాండర్‌గా పని చేశారు. 1665లో ఔరంగజేబును కలవడానికి శివాజీతో పాటు పంగారే ఆగ్రాకు వెళ్లారు. 1672లో సల్హిర్‌గఢ్ యుద్ధంలో మరాఠీల చేతిలో మొఘలులు ఘోర పరాజయాన్ని పొందారు. ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన మొఘలులు ఆ తర్వాత జనరల్ దిలేర్ ఖాన్, బహదూర్ ఖాన్ నాయకత్వంలో 10,000 మంది కూడిన సైన్యాన్ని నాసిక్ సమీపంలోని కన్హెర్‌గఢ్ కోటపై దాడికి పంపించారు.
ఆ సమయంలో కోటకు రక్షకునిగా రామ్ జీ పంగేరా ఉన్నారు. ఆ సమయంలో కేవలం 700 మంది సైన్యం మాత్రమే పంగారే వద్ద ఉంది. దీంతో ఆ 700 మంది సైన్యంతో కోటను రక్షించుకోవాలని అనుకున్నాడు. వెంటనే తనకున్న కొద్ది సైన్యంతో మొఘల్ సైనికులపైకి సింహంలాగా దూకాడు. రెండు చేతుల్లో కత్తులు ధరించి మొఘల్ సైన్యాన్ని ఊచ కోత కోశాడు.
ఓ వైపు శరీరంపై కత్తుల గాయాలు అవుతున్నా, ఒంటి నుంచి రక్తం కారుతున్నా యుద్దంలో ముందుకు దూసుకు వెళ్లాడు. యుద్ద రంగంలో సింహంల గర్జిస్తున్న రామ్ జీ పంగేరాను చూసి మొఘల్ సైన్యాలు తోక ముడిచాయి. వీళ్లు మరాఠీలు కాదు దెయ్యాలు అంటూ అరుచుకుంటూ పారిపోయారు. ఈ యుద్దంలో పంగేరా శరీరంపై 30కి పైగా కత్తి గాయాలు కావడంతో ఆయన మరణించారు. ఆయన ధైర్య సాహసాలకు ముగ్దుడైన శివాజీ రామ్ జీ పంగేరా కుటుంబానికి పలు గ్రామాలను బహుమతిగా ఇచ్చాడు.