తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల (Doubl Bed Room Houses) ప్రాజెక్ట్ కు నిరసనల సెగ తప్పడంలేదు. తాజాగా రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలంయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. నడిరోడ్డుమీద చేరి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణా ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ నిరసనకారులు పేర్కొన్నారు. పేదలూ ఇల్లు లేనివాళ్లకు కాకుండా ఇళ్లూ స్థలాలూ ఉన్నవారికే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఇక్కడి వాళ్లకు కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన స్థానికేతరలకు ఇక్కడ ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్ని అర్హతలూ ఉండీ డబుల్ బెడ్ రూమ్ కి దరఖాస్తు చేసుకున్నామనీ…. సంవత్సరాలు గడుస్తున్న తమకి ప్రభుత్వం ఇళ్లు కేటాయించకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.
మరోవైపు లబ్ధి దారుల నిరసనతో ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారిపోయింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను సెట్ చేస్తున్నారు.