వీరనారి అని చెప్పగానే మొదట గుర్తుకు వచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీ బాయి ((Jhansi Laxmi Bhai). రాజ్య సంక్రమణ సిద్దాంతాన్ని (Doctrine Of Lapse) ధిక్కరించి బ్రిటీష్ వాళ్లకి ఎదురు తిరిగిన వీర మహిళ. సిపాయిల తిరుగుబాటులో సర్ హ్యూరోస్ సైన్యాన్ని ఊచకోత కోసిన అపర కాళిక ఈమె. వీపున కుమారున్ని మోసుకుంటూ బ్రిటీష్ సేనలపై విరుచకుపడిన సివంగి ఝాన్సీ లక్ష్మీబాయి.
1835 నవంబర్ 19న జన్మించారు. అసలు పేరు మణికర్ణిక. తల్లిదండ్రులు భాగీరథీ బాయి, మోరోపంత్. పీష్వాల దగ్గర తండ్రి పని చేస్తుండటంతో పీష్వా కుమారులతో కలిసి చిన్నతనం నుంచే ఆమె యుద్ధ విద్యలు అభ్యసించారు. అతి తక్కువ కాలంలోనే కత్తిసాము, గుర్రపుస్వారీలో ఆరి తేరారు.
13 ఏండ్ల వయసులో ఝాన్సీ రాజు గంగాధర రావును వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేండ్లకే భర్త మంచాన పడటంతో ఓ కుమారున్ని దత్తత తీసుకున్నారు. గంగాధర్ రావు మరణంతో బ్రిటీష్ వాళ్ల కన్ను ఝాన్సీ రాజ్యంపై పడింది. రాజ్య సంక్రమణ సిద్దాంతం ఆధారంగా ఝాన్సీ రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కుట్రలు చేసింది.
దీంతో బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా లక్ష్మీ బాయి సమర శంఖాన్ని పూరించారు. నానా సాహెబ్, తాంతియా తోపేలతో కలిసి ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసి హ్యూరోస్ సేనలపై తిరుగుబాటు చేశారు. భుజాన తన కుమారున్ని వేసుకుని బ్రిటీష్ సైనికులకు వీరోచిత పోరాటం సాగించారు. గ్వాలియర్ కోటను రక్షించుకునే ప్రయత్నంలో చివరకు వీర మరణం పొందారు.