నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో కేటీఆర్ మిత్రుడు భూక్య జాన్సన్ (Johnson Naik) కు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ (BRS) అధిష్టానం. దీంతో.. రేఖా నాయక్ (Rekha Naik) తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖానాపూర్ లో తన సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. ఎన్నికలకు మూడు నెలలే సమయం ఉండటంతో తన నిర్ణయాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని అధిష్టానంపై మండిపడ్డారు రేఖా నాయక్. బీఆర్ఎస్ లో అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని.. గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే తనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం నిరాకరించారని అన్నారు. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాన్సన్ నాయక్ ది నకిలీ సర్టిఫికెట్ అని ఈ విషయం నిరూపించి తీరుతానని రేఖా నాయక్ కంటతడి పెట్టారు. మెట్ పల్లిలోని జాన్సన్ ఇంటిలో చర్చి ఉందని, ఆయన తండ్రి పాస్టర్ అని తెలిపారు. జాన్సన్ ఎస్టీ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారో, ఏ ఎమ్మార్వో ఇచ్చాడో బయటపెడుతానని అన్నారు. ఖానాపూర్ నుంచి తాను పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
రేఖా నాయక్ 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ తరపున ఆసిఫాబాద్ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీచేసి గెలిచారు. 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో ఖానాపూర్ నుంచి పోటీచేసి 30వేల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి.. 24వేలకు పైగా మెజారిటీ సాధించి గెలుపొందారు. కానీ, మూడోసారి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆమె తీవ్ర అసహనంలో ఉన్నారు.