షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ (Shaheed Ashfaqulla Khan)… గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు. కకోరి కుట్ర కేసు (Kakori Conspiracy)లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 27 ఏండ్లకే ఉరికంబం ఎక్కిన విప్లవ యోధుడు. అధికారం చేతులు మారే స్వాతంత్య్రం కాదు సమ సమాజాన్ని ఇచ్చే స్వేచ్ఛ కావాలని కోరుకున్న గొప్ప మేధావి. ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతున్ని తానని గర్వంగా చెప్పుకున్న భరతమాత ముద్దుబిడ్డ.
22 అక్టోబర్ 1900న ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జన్మించారు. తండ్రి షఫీకుర్ రెహమాన్. ఈయన పోలీస్ శాఖలో ఉద్యోగిగా పని చేశారు. అష్ఫాకుల్లా ఖాన్ కు ఏడవ తరగతిలోనే విప్లవ భావాలు మొదలయ్యాయి. చౌరీచౌర ఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ నిలిపి వేశారు. దీంతో నిరాశ చెందిన ఆయన అతివాద కార్యకలాపాల వైపు మొగ్గు చూపారు.
ఈ క్రమంలోనే రాం ప్రసాద్ బిస్మిల్ తో స్నేహం ఏర్పడింది. ఆయన ప్రోత్సాహంతో హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు. బ్రిటీష్ ప్రభుత్వం దాడులను ముమ్మరం చేసేందుకు ఆయుధాలు, ఆర్థిక వనరులు కావాలని హెచ్ఆర్ఎస్ఏ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బ్రిటీష్ వాళ్లు రైళ్లలో తరలించే ధనాన్ని, ఆయుధాలను కొల్లగొట్టాలని నిర్ణయించారు. 9 అగస్టు 1925న కకోరి వద్ద బ్రిటీష్ అధికారులు ప్రయాణిస్తున్న రైలుపై దాడి చేసి భారీగా డబ్బును దోచుకున్నారు.
భారత స్వాతంత్ర్య చరిత్రలో కకోరి కుట్ర కేసుగా ఇది అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ కేసులో రాం ప్రసాద్ బిస్మల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అష్ఫాకుల్లా ఖాన్ తప్పించుకున్నారు. ఆ తర్వాత రష్యా వేదికగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లారు. కానీ, ఓ స్నేహితుడి నమ్మక ద్రోహంతో అష్ఫాకుల్లా ఖాన్ ను బ్రిటీష్ అధికారులు పట్టుకున్నారు. 19 డిసెంబర్ 1927న ఆయన్ని ఉరితీశారు.