Telugu News » Moolmati Bismil : వీరమాత… మూలమతి బిస్మిల్…!

Moolmati Bismil : వీరమాత… మూలమతి బిస్మిల్…!

ఊహించుకుంటేనే కంటి నిండ నీళ్లు తిరుగుతున్నాయి కదా.... కానీ ఆ తల్లి (Mother) మాత్రం అలా చేయలేదు.

by Ramu

చాలా నెలల తర్వాత కుమారుడు తన కండ్ల ఎదుట నిల్చుంటే తల్లి (Mother) భావోద్వేగం ఎలా ఉంటుంది. ఆ సమయంలో తన కుమారుడిని మరో 24 గంటల్లో ఉరి తీస్తారని తెలిస్తే పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే కంటినిండా నీళ్లు తిరుగుతున్నాయి కదా.. కానీ, ఆ తల్లి మాత్రం అలా చేయలేదు. తన కొడుకు దేశం కోసం ఉరికంబం ఎక్కడం గర్వంగా ఉందని ప్రకటించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తన రెండవ కుమారున్ని కూడా బలివ్వడానికి సిద్ధమని గొప్పగా చెప్పింది. ఆమె ఎవరో కాదు.. మూలమతి బిస్మిల్ (Moolmati bismil).

స్వాతంత్ర్య సమర యోధుడు రాం ప్రసాద్ బిస్మిల్ మాతృమూర్తి ఈమె. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్నతనంలో రాం ప్రసాద్ విప్లవ పంథాను ఎంచుకున్నప్పుడు ఆనందంగా తనవంతు మద్దతు అందించారు మూలమతి. విప్లవ పుస్తకాల ప్రచురణకు తన వంతు సహాయం చేశారు. ఆ తర్వాత హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌ ను ఏర్పాటు చేశారు రాం ప్రసాద్.

ఈ సంస్థతో విప్లవకారులందరినీ ఆయన ఏకతాటికి పైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత కకోరి కుట్ర కేసులో బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. దీంతో తన కొడుకును కలిసేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు మూలమతి. ఈ క్రమంలో 1927 డిసెంబర్‌ లో గోరఖ్ పూర్ జైల్లో బిస్మిల్ ను ఉరితీసే ముందు ఆయన్ని కలుసుకున్నారు.

కన్నతల్లిని చూసి రాం ప్రసాద్ బిస్మిల్ కంటి నుంచి నీళ్లు ధారాళంగా వచ్చాయి. ఆ సమయంలో తన కుమారుడి కంట్లో నీళ్లు రావడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు మూలమతి. దేశం కోసం ఉరికంబం ఎక్కుతున్నావని తామంతా గర్వపడుతున్నామని చెప్పారు. కానీ, నువ్వు ఏడుస్తున్నావా? అని ప్రశ్నించారు.

మీ కొడుకును చూస్తే బ్రిటీష్ వాళ్లు వణికిపోతారని అంతా తనతో అన్నారని, కానీ, నువ్వేమో ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అని అడిగారు. చావుకు భయపడే వాడివి ఇలా విప్లవ మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నావంటూ వ్యాఖ్యలు చేశారు. రాం ప్రసాద్ బిస్మిల్ మరణాంతరం ఓ సభలో ఆమె మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కోసం విప్లవ పోరాటానికి తన మరో కుమారున్ని కూడా అంకితం ఇస్తానంటూ సగర్వంగా వెల్లడించారు.

You may also like

Leave a Comment