ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ హామీలతో గారడీ చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఆ హామీల అమలుకు చేసే అప్పులతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులు తీసుకునే యోచనలో ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో డ్వాక్రా మహిళా సంఘాలతో కిషన్ రెడ్డి ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ….బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.
ఇటీవల వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ద ప్రతిపాదికన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాల మహిళలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు.
వారి సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని చెప్పారు. రాజకీయంగా మహిళలు ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. పొదుపు సంఘాలకు ప్రతి ఊరికి డ్రోన్లు మోడీ పంపించారని తెలిపారు.మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉజ్వల యోజన పథకం కింద పేదలకు మోదీ ఉచితంగా గ్యాస్ ఇచ్చారని వివరించారు.