వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఏ సర్వే చూసినా ఇదే రిజల్ట్ వస్తోందని అన్నారు. గాంధీభవన్ లో ఆయన సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 25 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. అందుకే, అధికారం నుండి దిగిపోయే ముందు ఆస్తులను అమ్ముకుని కేసీఆర్ (KCR) విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ (Telangana) లో కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్ చుట్టూ ఆయన కుటుంబం పది వేల ఎకరాలు ఆక్రమించుకుందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడానికి జాగా లేదన్న కేసీఆర్ వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. సొంతవాళ్లకు అప్పగించేందుకు వైన్ షాపులకు ముందే టెండర్లు వేస్తున్నారని దుయ్యబట్టారు. 4 నెలల ముందు టెండర్లు ఎలా ఇస్తారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామన్నారు.
హైదరాబాద్ లో భూములు కొన్నవారు జాగ్రత్త.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ సూచించారు రేవంత్. వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పాలనలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పారు. అయినా, తెలంగాణ ఇచ్చింది.. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకోవడానికి.. దళితుల భూములు గుంజుకోవడానికి కాదన్నారు. పేదలకు కాంగ్రెస్ పట్టా భూములు ఇస్తే.. అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ గుంజుకుంటోందని ఆరోపించారు. వంద కోట్లు పలికే భూములకు ఎకరానికి కోటి అయినా పేదలకు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు తన పాలన మీద నమ్మకం ఉంటే సిట్టింగులు అందరికీ టికెట్లు ఇవ్వాలని గజ్వేల్ నుంచి కేసీఆరే పోటీ చేయాలని సవాల్ చేశారు రేవంత్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. ఈ విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. ఆయనకు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారుల పేర్లు రెడ్ డైరీలో రాసిపెట్టుకుంటున్నామని అధికారంలోకి రాగానే మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.