Telugu News » Revanth Reddy : అందరం ఏకమౌదాం.. బీఆర్ఎస్ ను తరిమేద్దాం!

Revanth Reddy : అందరం ఏకమౌదాం.. బీఆర్ఎస్ ను తరిమేద్దాం!

కాంగ్రెస్ ను గెలిపించేందుకు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయ్ అని అన్నారు. కృష్ణా రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ నమ్మించారని గుర్తు చేశారు.

by admin
Revanth Reddy Nomination At Kodangal Constituency

– ఐదేళ్లలో కొడంగల్ కు ఏం చేశారు?
– ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు
– ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు
– మోసం చేసిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెబుదాం
– కాంగ్రెస్ ను గెలిపించేందుకు..
– అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి
– కొడంగల్ లో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి

ఐదేళ్లలో కొడంగల్ కు సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR) ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోమవారం నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని నిలదీశారు. దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ చేశానని.. అభివృద్ధి చేయలేదు కాబట్టే స్వీకరించలేదన్నారు.

Revanth Reddy Nomination At Kodangal Constituency

కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవి తనది కాదన్న రేవంత్… కొడంగల్ లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడేనని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత వారిపై ఉందన్నారు. నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేవని అభివర్ణించారు. ఈ ఎన్నికలు కొడంగల్ (Kodangal) ప్రాంత ప్రజలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయన్నారు. కర్ణాటక (Karnataka) లో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ లక్షకు పైగా మెజారిటీ వచ్చిందని.. అంత కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలని కోరారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

2009లో కరీంనగర్ (Karimnagar) నుంచి కేసీఆర్ పారిపోయి పాలమూరుకు వస్తే తాము కడుపులో పెట్టుకుని గెలిపించామని గుర్తు చేశారు రేవంత్. ఇక్కడి ఎమ్మెల్యే ఒక్కసారి కూడా కొడంగల్ కోసం అసెంబ్లీలో ఏం మాట్లాడలేదన్నారు. మరి, ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. కొడంగల్ కోసం తాను, గురునాథ్ రెడ్డి, నందారం కుటుంబం ఏకమయ్యామన్నారు. ప్రజలంతా కూడా ఏకం కావాలని చెప్పారు. ఇక్కడ అన్ని అభివృద్ధి పనులు కోసం తాను బాధ్యత తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ను గెలిపించేందుకు అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయ్ అని అన్నారు. కృష్ణా రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ నమ్మించారని గుర్తు చేశారు. హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. అన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కేనా… కొడంగల్ కు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

You may also like

Leave a Comment