Telugu News » Revanth Reddy : నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్ష కట్టారు…..!

Revanth Reddy : నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్ష కట్టారు…..!

కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని అన్నారు.

by Ramu

కల్వకుంట్ల కవిత (Kavitha)ను ఓడించినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ (KCR)కక్ష కట్టారని, జిల్లాలో అభివృద్ధి చేయడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని అన్నారు. పదవి పోతుందనే భయంతో సీఎం కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు ఇప్పటికీ తీరలేదని చెప్పారు. పదేండ్లు గడుస్తున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదన్నారు. గతంలో నిజామాబాద్‌ నుంచి ఐదేండ్లు ఎంపీగా పని చేసిన ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ప్రాంత ప్రజల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వేలకోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. కేసీఆర్ లాగానే బాజిరెడ్డి కూడా ఫామ్ హౌజ్‌లు కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఎమ్మెల్యే బాజిరెడ్డి మాత్రం ఆస్తులు సంపాదించుకున్నాడని తీవ్రంగా మండిపడ్డారు. పసుపు రైతులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించకపోవడంతో 2019లో కవితను ప్రజలు ఓడించారన్నారు.

అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ కక్షగట్టారని, జిల్లాలో అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల హక్కులను బాజిరెడ్డి గోవర్ధన్ కాలరాశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీల్ అమ్మకాలు, కొనుగోళ్లలో కమీషన్లకు కక్కుర్తి పడి 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని నిప్పులు చెరిగారు.

ఎర్రజొన్న రైతులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఈ యుద్దంలో నిజామాబాద్ జిల్లా ఎవరివైపు ఉంటుందో చూద్దామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చిందన్నారు. ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కూడా ఈ ప్రాంత రైతులు, ప్రజల కోసం పని చేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి కూడా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కి పైగా సీట్లు వస్తాయన్నారు. తనపై దాడి చేసేందుకు కాంగ్రెస్ వాళ్లు వస్తున్నారని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. నిజంగా బక్కోడివి కదా మరి లక్షల కోట్లు ఎలా మిగావు అని నిలదీశారు.

కాంగ్రెస్ హయంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను చూపించి తాము ఓట్లు అడుగుతామన్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టును చూపి ఓట్లు అడిగేందుకు కేసీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ లాంటి వాళ్లను పొలిమేర్ల దాటే వరకూ తరిమికొడతామన్నారు. ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ మాట్లాడుతున్నాడనన్నారు. బరాబర్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకు వస్తామని చెప్పారు.

తాము కట్టిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టును చూపించి కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు. కేసీఆర్ మేడిగడ్డను చూపించి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మీసమున్న మొనగాడివే అయితే కేసీఆర్ ఈ ఛాలెంజ్‌ను అంగీకరించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్లను బాగుచేసే రాజ్యమన్నారు. బీఆర్ఎస్ పాలన అంటే దొరలు, దోపీడి, కమీషన్లు, ఇసుక దొంగల రాజ్యమన్నారు. చివరకు ఆడబిడ్డల మెడలోని తాళిబొట్లను లాక్కుంటున్న దోపిడిదొంగల రాజ్యమని తీవ్ర విమర్శలు గుప్పించారు.

బోధన్ ఏసీపీ తన విధులు తాను నిర్వర్తించకుండా బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవవహరిస్తున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9 తర్వాత ఏం జరుగుతుందో ఏసీపీ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఏసీపీ కొడుతున్నాడని తమ నాయకులు చెబుతున్నారని అన్నారు. మరో 15 రోజులు మాత్రమే మిగిలి వుందని, తమ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లను తమ నాయకుల రెడ్ డైరీలో రాసుకుంటున్నామన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలన్నారు.

You may also like

Leave a Comment