గత బీఆర్ఎస్ (BRS) సర్కార్ నిర్లక్ష్యం వల్ల శ్రీ శైల విద్యుత్ సొరంగ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రమాదం గురించి రెండు రోజుల ముందే హెచ్చరించినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆ ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఏఈ ఉజ్మా ఫాతిమా చనిపోయారని చెప్పారు.
అప్పుడు ఆమె కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుందని తెలిపారు. కనీసం బాధిత కుటుంబాన్ని అప్పటి సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి పరామర్శించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం కూడా లేదన్నారు. ప్రమాదంపై కనీసం విచారణకు కూడా అప్పటి ప్రభుత్వం ఆదేశించలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ లో విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్ రావు, గజ్వేల్ లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్ ఓవైసీ బాధ్యత తీసుకుని ప్రజలు బిల్లులు చెల్లించేలా చూడాలన్నారు. అలా చేస్తే విద్యుత్ శాఖ అప్పుల నుంచి బయట పడుతుందని వెల్లడించారు.
పాత మిత్రున్ని (బీఆర్ఎస్)ను కాపాడేందుకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎంఐఎం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. పాతబస్తీ అభివృద్ధి కాలేదనే వ్యాఖ్యల్లో అర్థం ఉందా..? అని నిలదీశారు.
మైనార్టీల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ను ఎవరూ శంకించాల్సిన పనిలేదన్నారు. ముస్లిం అభ్యర్థులను ఓడించేందుకు ఎంఐఎం పని చేయలేదా..? అని ప్రశ్నించారు. ఇది ఇలా వుంటే గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలపై సీఎం రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్, సిద్దిపేట, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలవలేదని సీఎం రేవంత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
బిల్లులు చెల్లించని వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని కోరారు. అంతే కానీ నియోజకవర్గం ప్రజల మొత్తాన్ని నిందించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తారనే కాంగ్రెస్, టీడీపీతో పొత్తులు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మోసం చేస్తే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీ మారారని, తాము తెలంగాణ కోసమే పొత్తులు పెట్టుకున్నామన్నారు.