సీఎం కేసీఆర్ (KCR) రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని మరోసారి విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించారు రేవంత్. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఓవైపు కాంగ్రెస్ (Congress) హామీలు ఇస్తుంటే.. కేసీఆర్ కూడా అదే ఫాలో అవుతున్నారని అన్నారు రేవంత్. ఓటమి భయంతోనే రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కాంగ్రెస్ వల్లేనని.. కేసీఆర్ ఏది చేసినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై మేం వచ్చాక సమీక్షిస్తామని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని.. 10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. దేశాన్ని ప్రగతిఫథం వైపు నడిపింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదామని… రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు రేవంత్. ప్రధాని మోడీ ( PM Modi) స్లోగన్స్ కు మాత్రమే పరిమితమయ్యారని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల (Jobs) హామీ ఏమైందని ప్రశ్నించారు.
దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్న ఆయన… దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని అన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్ఫూర్తి నింపారని.. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన అప్పు కంటే.. మోడీ రెండింతలు ఎక్కువ చేశారని ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చారని.. పీవీ, మన్మోహన్ దేశాన్ని ఆర్థికంగా పురోగతి వైపు నడిపించారని కొనియాడారు రేవంత్ రెడ్డి.