శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala Ayyappa Swamy)ఆలయం ఆదాయం (Revenue Collection) భారీగా పెరిగింది. తాజాగా ఆలయ ఆదాయం 200 కోట్లు దాటింది. గడిచిన 39 రోజుల్లో ఆలయ ఆదాయం రూ. 204.30 కోట్లకు చేరినట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (The Travancore Devaswom Board) వెల్లడించింది.
కానుకల రూపంలో వచ్చిన నాణెలను లెక్కిస్తున్నామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడిచారు. ఈ క్రమంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇప్పటి వరకు భక్తులు రూ. 63.89 కోట్లను కానుకల రూపంలో అందించారని తెలిపారు. అరవన ప్రసాదాన్ని విక్రయించడం ద్వారా రూ. 96.32 కోట్లు, అప్పం ప్రసాదం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్లు చెప్పారు.
మండల పూజ సమయంలో ఈ నెల 25 వరకు సుమారు 31,43,163 భక్తులు ఆలయాన్ని సందర్శించారని ప్రశాంత్ వివరించారు. టీడీబీలో పరిమితులు ఉన్నప్పటికీ భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించామని పేర్కొన్నారు. బోర్డు తన ”అన్నదాన మండలం” ద్వారా డిసెంబర్ 25 వరకు 7,25,049 మందికి ఉచిత భోజనాలు పెట్టామని చెప్పారు.
మండల పూజ అనంతరం ఆలయాన్ని బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. డిసెంబర్ 30న మకరవిళక్కు పూజల నిమిత్తం మళ్లి ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 15 వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మరో వైపు శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు సోమవారం ఆలయాన్ని దర్శించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.