భగత్ సింగ్ (Bagath Singh)… జ్వలించే నిప్పు కణిక. పసితనంలోనే పొలంలో తుపాకులు నాటుతున్నానని చెప్పిన విప్లవ వీరుడు. తనను చంపగలరు గానీ తన ఆలోచనలను చంపలేరంటూ తెగేసి చెప్పిన మేధావి. చెవిటి వాళ్లకు వినిపించాలంటే ఆ శబ్దం అత్యంత పెద్దదై ఉండాలంటూ బ్రిటీష్ సామ్రాజ్యంపై బాంబు (Bombs) దాడులు చేసిన కరుడు గట్టిన పోరాట యోధుడు ఆయన.
1907 సెప్టెంబర్ 27న ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతంలో భగత్ సింగ్ జన్మించారు. చిన్నతనం నుంచే విప్లవ పాఠాలను ఒంట పట్టించుకున్నాడు. నాలుగేండ్ల వయస్సు నుంచే ఆంగ్లేయులపై ప్రతీకార కాంక్షతో రగిలిపోయాడు. జలియాన్ వాలా బాగ్ ఘటనతో ఆంగ్లేయులపై ఆగ్రహంతో ఊగిపోయాడు.
భట్ కేశ్వర్ దత్తో కలిసి కేంద్ర పార్లమెంట్ పై బాంబు దాడి చేసి తెల్ల దొరల్లో వణుకు పుట్టించాడు. సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో బ్రిటీష్ అధికారి శాండర్స్ చేతిలో పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. పంజాబ్ కేసరి మరణానికి కారణమైన శాండర్స్ ను మట్టు పెట్టే వరకు తనకు మనశ్శాంతి లేదన్నాడు.
తన సహచరులు రాజ్ గురు, సుఖదేవ్ లతో కలిసి శాండర్స్ ను కసి తీరా కాల్చాడు. ఈ కేసులో వారికి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించగా నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడాడు. చివరి క్షణాల్లో కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ పోరాట స్ఫూర్తిలో ప్రాణాలు విడిచిన గొప్ప పోరాట యోధుడు భగత్ సింగ్.