షహీద్ హరి కిషన్ తల్వార్ (Shaheed Hari Kishan Talwar).. పోరాటం ఆయన ఊపిరి. చిన్నతనం నుంచే భగత్ సింగ్ (Bagath Singh), షహీద్ రాం ప్రసాద్ బిస్మల్, అశ్వఖుల్లా ఖాన్‌ను చూస్తూ అణవణువునా పోరాట గుణాన్ని నింపుకున్నాడు. భగత్ సింగ్ స్ఫూర్తితో పంజాబ్ గవర్నర్ పై దాడికి ప్రయత్నించాడు. గవర్నర్ జెఫ్రీ డీ మాంటీ మోర్సిపై కాల్పులకు యత్నించి చివరకు ఉరికంబం ఎక్కాడు.
షహీద్ హరి కిషన్ తల్వార్ తండ్రి లాలా గురుదల్ మాల్, తల్లి మదుర. చిన్నతనంలోనే ఉగ్గు పాలతో కలిపి దేశ భక్తిని తల్లిదండ్రులు ఆయనకు పట్టించారు. న్యాయస్థానంలో భగత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు విని స్ఫూర్తి పొంది స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భగత్ సింగ్ స్ఫూర్తితో పంజాబ్ గవర్నర్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
23 డిసెంబర్ 1930న పంజాబ్ వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ పై కాల్పులు జరిపాడు. తుపాకి గురి తప్పి బుల్లెట్లు గవర్నర్ కుర్చికి తగిలాయి. దీంతో పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. అనంతరం ఆయన్ని జైళ్లో పెట్టగా పక్క గదిలో ఉన్న భగత్ సింగ్ ను కలవాలంటూ పరితపించిన గొప్ప దేశ భక్తుడు.
రెండు మంచు గడ్డల మధ్య పడుకోబెట్టి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చిరునవ్వుతో భరించిన ధీశాలి. ఉరికంబం ఎక్కుతూ… తనకు మరో జన్మ అంటూ ఉంటే ఇదే గడ్డపై పుట్టించాలని, అప్పుడు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతానని, అప్పుడు కూడా వలస పాలన నుంచి మాతృభూమికి విముక్తి కల్పించే అవకాశం కల్పించాలని దేవున్ని ప్రార్థించిన గొప్ప దేశభక్తుడు ఆయన.