బ్రిటీష్ పాలన నుంచి భారత్ (India)కు విముక్తి కలిగించేందుకు ఈ గడ్డపై ఎంతో మంది పోరాటాలు చేశారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. వారిలో కొంత మంది జీవితం చరిత్ర పుటల్లోకి ఎక్కగా, మరికొందరి జీవితాలు చరిత్రకు అందని పాఠాలుగా మిగిలిపోయాయి. అలాంటి వారిలో షహీద్ రామకృష్ణ బిశ్వాస్ (Shaheed Rama Krishna Biswas)ఒకరు.
16 జనవరి 1910న చిట్టగాంగ్ (నేటి బంగ్లాదేశ్)లోని సరోతాలిలో జన్మించారు. తండ్రి దుర్గా కృపా బిస్వాస్. విద్యాభ్యాసం అనంతరం సూర్యసేన్ స్పూర్తితో విప్లవ బాట పట్టారు. 1930లో బాంబుల తయారీ చేసే సమయంలో పొరబాటున బాంబు పేలడంతో రామకృష్ణ బిశ్వాస్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విప్లవ కార్యకలాపాలకు ఆయన కాస్త విరామం ప్రకటించారు.
ఆ సమయంలో చిట్టగాంగ్‌లో విప్లవకారులను ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రెయిగ్ తీవ్రంగా అణచివేశారు. దీంతో ఎలాగైనా క్రెయిగ్ ను హతమార్చాలని చిట్టగాంగ్ విప్లవకారులు నిర్ణయానికి వచ్చారు. ఆ బాధ్యతను షహీద్ రామకృష్ణ, కాళీపద చక్రవర్తికి అప్పగించారు. ప్లాన్ ప్రకారం 1 డిసెంబర్ 1930న చాంద్ పూర్ రైల్వే స్టేషన్ వద్దకు వారిద్దరూ చేరుకున్నారు.
అక్కడ పొరబాటున ఐజీ క్రెయిగ్ కు బదులుగా మరోవ్యక్తిపై రామకృష్ణ దాడి చేశారు. అక్కడి నుంచి వాళ్లు పారిపోగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణ అనంతరం ఆయనకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. షహీద్ బిశ్వాస్‌ను 04 ఆగస్టు 1931న అలీపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. చక్రవర్తిని అండమాన్ జైలుకు తరలించారు.