హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే రూ. 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారంటే చంద్రబాబు (Chandra Babu) ఆస్తి రూ. 20 వేల కోట్లని ఆర్కే రోజా (RK Roja) అన్నారు. మరి ఈ విషయాలను చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్ లో స్పష్టం చేశారా? అని రోజా ప్రశ్నించారు. స్కాం (Scam)లలో ఇరుక్కుని ఢిల్లీ (Delhi) కి పారిపోయిన నారా లోకేశ్.. ఆరు నెలల్లో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.
అరెస్టు భయంతో ఢిల్లీలో దాక్కున్న లోకేశ్.. ఎర్రబుక్ లో రాసుకుంటానంటూ అధికారులను బెదిరిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏనాడూ రాష్ట్రపతిని కలవని లోకేశ్ ఇప్పుడు తండ్రిని విడుదల చేయాలంటూ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదంటే అర్థం… అవినీతి చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అని ఆమె తెలిపారు.
ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు స్కాం ఎలా జరిగిందంటూ నారా లోకేశ్ ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావిస్తూ… రోడ్డు వేయకముందే ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారని మంత్రి రోజా తెలిపారు. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని ఆరోపించారు.
నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలు… చంద్రబాబు ఏ తప్పూ చేయలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని మంత్రి రోజా తెలిపారు. వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతోందని అన్నారు. బాబు కుటుంబం మొత్తం కలిసి టీమ్ గా అవినీతికి పాల్పడ్డారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా వీటి గురించిన పూర్తి నిజాలు తెలుసుకోవాలని మంత్రి రోజా కోరారు.