సాధారణంగా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు జంతువులు, పాములు అడ్డుగా రావడం చూసే ఉంటాం. కొన్ని సార్లు వాటిని తప్పించబోయి ప్రమాదాలూ చోటుచేసుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కోతి ప్రాణాలను కాపాడుదామనుకున్న ఆటో డ్రైవర్ 13మంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. అయితే, ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందడంతో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని వేములవాడ శివారులోని చింతల్ పోలీస్‌స్టేషన్(Chinthal Police Station)కు చెందిన మహిళా కూలీలు వరినాట్ల కోసం చందుర్తి మండలం మర్రిగడ్డకు వెళ్లారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి ఓ ఆటోలో బయల్దేరారు. ఒకే ఆటోలో 13మంది కూలీలు ఉండగా ఊహించని ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. కూలీలు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా ఉన్నసమయంలో ఓ కోతి ఒక్కసారిగా రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇది చూసిన ఆటో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో పల్టీలు కొడుతూ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మిగతా వారు తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గురయినవారంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.