తెలంగాణ (Telangana) రహదారులు నెత్తురోడాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా.. ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వరంగల్ (Warangal) జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు దగ్గర ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది లారీ. ఆటోలో ఏడుగురు ప్రయాణిస్తుండగా.. స్పాట్ లో నలుగురు చనిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరు చనిపోగా.. మిగిలిన ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్ (Rajastan) కు చెందిన లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపంతో పాటు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోలో ప్రయాణం చేస్తున్న వారంతా దినసరి కూలీలే. తేనె అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. మృతదేహాలను వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇటు శామీర్ పేట (Shamirpet) పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజ్ఞాపూర్ నుండి హైదరాబాద్ (Hyderabad) వైపు వస్తున్న కారు.. ట్రాక్టర్ ను అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మరణించాడు. సంజయ్ నగర్ బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలుడు అహ్మద్ బస్టాండ్ నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో స్కిడ్ అయి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అహ్మద్ చనిపోయాడు.