హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohith Sharma) అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ కప్‌లో భాగంగా అప్ఘనిస్తాన్ (Afghanisthan)తో జరగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ తో విరుచుకు పడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో అప్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో కేవలం 63 బంతుల్లోనే హిట్ మ్యాన్ సెంచరీ సాధించాడు. అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
తాజా సెంచరీతో ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ సెంచరీల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన సచిన్ వరల్డ్ కప్ లో మొత్తం ఆరు సెంచరీలు కొట్టాడు. కేవలం 19 ఇన్నింగ్స్ ల్లోనే రోహిత్ ఈ రికార్డును చేరుకోవడం విశేషం.
ఇది ఇలా వుంటే వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 31వ సెంచరీ కావడం గమనార్హం. వన్డే ఫార్మాట్లలో 30కి పైగా సెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించారు. అంతకు ముందు సచిన్ టెండూల్కర్ 49, విరాట్ కోహ్లీ 47 సెంచరీలు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో వున్నారు. మరోవైపు ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు సాధించిన రెండో వ్యక్తిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.
అంతకు ముందు మాస్టర్ బ్లాస్టర్ ఓపెనర్ గా 45 సెంచరీలు చేసి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. తాజా సెంచరీతో కలిపి ఓపెనర్ గా రోహిత్ ఇప్పటి వరకు 29 సెంచరీలు బాదాడు. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలకం బ్యాటర్ సనత్ జయసూర్య 28, విండీస్ బ్యాటర్ క్రిస్ గెయిల్ 27, హషీమ్ అమ్లా 25లు వున్నారు.