హైదరాబాద్(Hyderabad) వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌కు షాక్ తగిలింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో టీమ్ ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్ లీ (7/62) దెబ్బకు భారత్ 202 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. అయితే, భారత్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్ తమ ఓటమికి కారణంగా తెలిపాడు. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలి పోప్ అసాధారణ ప్రదర్శన ఇచ్చాడని ప్రశంసించాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించడం కష్టం. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో ఇక గేమ్ మాదే అనుకున్నాం. కానీ ఓలి పోప్ అసాధారణ బ్యాటింగ్‌తో మాకు విజయాన్ని దూరం చేశాడు. పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 230 పరుగులు పెద్ద లక్ష్యమేమి కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినా టార్గెట్‌ను ఛేజ్ చేయలేకపోయాం’ అని తెలిపాడు.
అదేవిధంగా ‘మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రణాళికలను అమలు చేయడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. మేం ఏ ప్రదేశాల్లో బౌలింగ్ చేశామో స్వయంగా వెళ్లి పరీక్షించాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశాం. నేను మ్యాచ్‌ను ఐదో రోజు వరకు తీసుకువెళ్లాలనుకున్నాను. కానీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. మా లోయర్డ్ ఆర్డర్ బ్యాటర్లు ఆఖరివరకు పోరాడారు’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.