ఒడిశాలోని పూరి శ్రీ జగన్నాథ స్వామి (Puri Jagannath Temple) దేవాలయాన్ని యూట్యూబర్ కమియా జానీ (Kamiya Jani) దర్శించుకోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గో మాంస వినియోగాన్ని ప్రోత్సహించే వ్యక్తిని ఆలయంలోకి ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లాది మంది హిందువుల మతపరమైన మనోభావాలను కమియా జానీ దెబ్బతీశారని ఒడిశా బీజేపీ ప్రధాన కార్యదర్శి జతిన్ మొహంతి నిప్పులు చెరిగారు. కమియా జానీని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కమియా జానీ తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. సీఎం నవీన్ పట్నాయక్ వారసుడిగా చెబుతున్న మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్‌తో కమిష్ జానీ మాట్లాడటం వీడియోలో కనిపిస్తోంది. ‘మహాప్రసాద్’, హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ కమియాతో పాండియన్ విస్తృతంగా చర్చించినట్టుగా వీడియో ద్వారా తెలుస్తోంది.
ఆలయంలోకి జానీని అనుమతించడంపై ప్రతిపక్ష బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆలయ ప్రాంగణంలోకి కెమెరాలు, వీడియోలను శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA)నిషేధించిందని తెలిపింది. కానీ ఆలయ ప్రాంగణంలో వీడియో కెమెరాను జానీ ఉపయోగించారని ఆరోపించింది. ఈ విషయంలో కూడా జానీపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించింది.