హకీంపేట (Hakimpet) స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. పలు అనుమానాలను లేవనెత్తారు. ట్విట్టర్ లో.. హకీంపేట ఘటన వార్తను పోస్ట్ చేసిన ఆయన.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘‘ఒక వెటర్నరీ డాక్టర్ కు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో ఏం పని అంటూ ప్రశ్నించారు ఆర్ఎస్పీ. ఈ దుండగుడు ఎవరో డాక్టర్ హరికృష్ణ అని అంటున్నారు.. ఆయనను పశుసంవర్థక శాఖ నుండి క్రీడా శాఖకు ఎవరు బదిలీ చేశారో? ఎందుకు బదిలీ చేశారో తేలాలన్నారు. ‘‘ఈయన తెలంగాణ గెజిటేడ్ అధికారుల సంఘం నాయకుడనేనా క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2025 దాకా డెప్యుటేషన్ ఇచ్చిండు?’’ అని మండిపడ్డారు.
హరికృష్ణ-శ్రీనివాస్ గౌడ్ మంత్రి వ్యవహారాల మీద లోతైన విచారణ జరిపి ఈ కీచకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్. కేసీఆర్ కు మహిళల మీద ఏ మాత్రం గౌరవమున్నా శ్రీనివాస్ గౌడ్ ను అర్జంటుగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మీ పిల్లలకొక న్యాయం, మా పేద పిల్లలకొక న్యాయం ఉండొద్దని… తెలంగాణను మరో మణిపూర్ గా మార్చకండి అంటూ హితవు పలికారు.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో ఓఎస్డీ హరికృష్ణ బాలికలను కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆటవిడుపు పేరుతో బాలికలలో కొంతమందిని బయటకు తీసుకెళుతున్నాడని, అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.