కుల గణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)తన వైఖరిని తెలిపింది. కుల గణన (Cast Census)కు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని వెల్లడించింది. కానీ కుల గణన వివరాలను సమాజ అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలని సూచించింది. కుల గణనపై ఎలాంటి రాజకీయాలు (Politics)ఉండకూడదని పేర్కొంది.
ఇటీవల కుల గణన వ్యతిరేకిస్తూ శ్రీధర్ గాడ్గే అనే ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలు చేశారు. కుల గణన అనేది ఒక నిర్ధిష్ట వర్గం జనాభాకు సంబంధించిన డేటాను తెలియజేస్తుందని తెలిపారు. దీనివల్ల కొంత మంది నేతలకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత పరంగా చూస్తే ఇలాంటివి కోరదగినవి కాదన్నారు.
ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగ చీఫ్ సునీల్ అంబేకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కుల గణనను నిర్వహించేటప్పుడు అది సమాజంలో చీలికలను సృష్టించకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సామరస్యం, సామాజిక న్యాయం ఆధారంగా హిందూ సమాజం కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
కుల గణనను సమాజ సమగ్ర అభివృద్ధికి ఉపయోగించాలని తాము అభిప్రాయపడుతున్నామని వెల్లడించారు. వివిధ చారిత్రక కారణాల వల్ల సమాజంలోని అనేక వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనన్నారు. కుల గణన చేస్తున్నప్పుడు సామాజిక సామరస్యం, ఐక్యతలు ఏ కారణం చేతనైనా విచ్ఛిన్నం కాకుండా అన్ని పార్టీలు చూసుకోవాలన్నారు.