– వివాదాస్పద మత స్థలాలన్నీ హిందువులవే
– ముస్లింలు హిందూ సమాజానికి అప్పగించాలి
– మతాల మధ్య సంఘర్షణకు ముగింపు పలకాలి
– అయోధ్య రామ మందిరం జాతీయ ఆలయం
– ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు వివాదాస్పద మత స్థలాలన్నింటినీ స్వచ్ఛందంగా హిందూ సమాజానికి అప్పగించాలని అన్నారు. ప్రతీ మసీదులో శివలింగాన్ని కనుగొనాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని ఆయన గుర్తు చేశారు.
మతాల మధ్య పరస్పర సంఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ ప్రకటన చేశారని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరినప్పుడే సమాజం హింస, ద్వేషం నుంచి విముక్తి పొందే దిశగా ఆలోచిస్తుందన్నారు. సనాతన ధర్మ అనుచరులకు చెందిన ఆలయాలను విదేశీ ఆక్రమణదారులు కూల్చివేశారని చెప్పారు.
ఈ విషయాన్ని మోహన్ భగవత్ స్పష్టం చేశారన్నారు. ఇప్పుడు సత్యం గురించి వెతకాల్సిన పని లేదని అన్నారని తెలిపారు. సత్యం అనేది అందరి ముందు స్పష్టంగా కనిపిస్తోందని, దాన్ని అందరూ అంగీకరించాలని కోరారు. అందువల్ల, ముస్లింలు, ఇతర మతాలకు చెందిన వారు ముందుకు వచ్చి హిందువుల వివాదాస్పద మత స్థలాలను అప్పగించాలని విన్నవించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంతోషకరమైన వాతావరణం నెలకొందన్నారు ఇంద్రేష్ కుమార్. అయోధ్య జాతీయ దేవాలయమని.. రాముడు అందరిలోనూ ఉన్నాడని తెలిపారు. భారత్ అన్ని మతాలను అంగీకరించే, గౌరవించే దేశమన్న ఆయన.. రామ మందిరాన్ని జాతీయ ఆలయం అని పిలవడం సరైందన్నారు.