Telugu News » RSS : దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోంది!

RSS : దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోంది!

దేశం ఎప్పటికీ ‘హిందూ రాష్ట్రం’ గానే ఉంటుందని, ఆ మేరకు అధికారికంగా ఎటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు దత్తాత్రేయ హోసబాలే. భారతదేశం స్వాభావికంగా హిందూ రాష్ట్రం అని తెలిపారు.

by admin
RSS leader Dattatreya Hosabale on hindu rashtra no need to establish hindu rashtra in India

దేశవ్యాప్తంగా పథకం ప్రకారం హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారని చాలాకాలంగా హిందూ సంఘాలు అంటున్నాయి. ‘లవ్ జిహాద్’ పేరుతో మతం మార్చేస్తున్నారని.. ఇది రానున్న రోజుల్లో మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే (Dattatreya Hosabale) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘లవ్ జిహాద్’ కు అడ్డుకట్ట వేయడానికి రెండు కీలక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.

RSS leader Dattatreya Hosabale on hindu rashtra no need to establish hindu rashtra in India

ఒకటి ప్రజల్లో అవగాహన కల్పించడం. రెండోది చట్టపరమైన కేసులపై పోరాడడం. ఇలా ‘లవ్ జిహాద్’ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. మతాంతర వివాహాల ద్వారా హిందూ మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. ఇలాంటి ట్రాప్ లో పడి కుటుంబాలకు దూరమైన మహిళల పునరావాసంపై కూడా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తోందని తెలిపారు. గుజరాత్ లోని భుజ్ లో 3 రోజులపాటు జరిగిన అఖిల భారతీయ కార్యకారి మండల్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశం ఎప్పటికీ ‘హిందూ రాష్ట్రం’ గానే ఉంటుందని, ఆ మేరకు అధికారికంగా ఎటువంటి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు దత్తాత్రేయ హోసబాలే. భారతదేశం స్వాభావికంగా హిందూ రాష్ట్రం అని తెలిపారు. ఈ సందర్భంగా “హిందువు అని చెప్పుకునే చిట్టచివరి వ్యక్తి ఉన్నంత వరకు భారతదేశం హిందూ దేశంగా కొనసాగుతుంది” అని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ వ్యాఖ్యలను గుర్తు చేశారు.

హిందుత్వం అంటే దేశానికి, సమాజానికి, సంస్కృతికి, మతానికి ఏదైనా మంచి చేయాలనే భావన అని చెప్పారు హోసబాలే. ఈ హిందూత్వాన్ని నిజం చేసేందుకు సంఘ్ కృషి చేస్తోందన్నారు. ఫలితంగా హిందూ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశాన్ని ఉత్తర, దక్షిణంగా విభజించే కుట్ర జరుగుతోందని అన్నారు.

దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరని కొందరు అంటున్నారని, తాము ద్రావిడులమని, తమ భాష కూడా వేరని చెబుతూ దక్షిణాదిని విభజించేందుకు రాజకీయ, మేధో స్థాయిలో కుట్ర జరుగుతోందని తెలిపారు. ఇది దేశాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడ అని చెబుతూ దీన్ని వ్యతిరేకించేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇటువంటి విభజన భావాలు భారతదేశ ఐక్యతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు దత్తాత్రేయ హోసబాలే.

You may also like

Leave a Comment