కేరళ (Kerala) లోని ఎర్నాకులంలో ఆర్ఎస్ఎస్ (RSS) సీనియర్ ప్రచారక్ రంగ హరి (Ranga Hari) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 7.45 గంటల సమయంలో అమృత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. 11 గంటలకు ఎర్నాకులంలోని మాధవ నివాస్ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యాలయానికి ప్రార్ధివదేహాన్ని తీసుకెళ్లారు. రేపు ఉదయం 6 గంటలకు ‘తానల్’ నిరాశ్రిత బాలుర ఆవాసం, ఓట్టప్పాలెం, పాలక్కాడ్ తీసుకువెళ్తారు.
భరతపుళా నది ఒడ్డున ఐవర్ మఠ్ ప్రాంగణంలో రంగ హరి అంతిమ సంస్కారాలు జరుగుతాయి. దశాబ్దాల కాలంగా కేరళలో సంఘకార్య విస్తరణకై ఎంతో కష్టపడ్డారు. స్థానికంగా కేరళ ప్రాంత ప్రచారకులుగా బాధ్యతలు నిర్వహించి తదనంతరం అఖిల భారతీయ సహ బౌద్ధిక్ ప్రముఖ్ గా, అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ గా అనేక సంవత్సరాలు పనిచేశారు.
రంగ హరి గురించి విశ్వహిందూ పరిషత్ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు (Kesavaraju) వివరించారు. దేశంలోని ప్రజల ఆలోచనలో మార్పు రావడానికి కావలసిన నెరెటివ్స్ ప్రిపేర్ చేయడంలో రంగ హరి యోగదానం చాలా గొప్పదన్నారు. “లోకమంథన్” వంటి వేదికల మాధ్యమంగా ప్రజల ఆలోచనా ధోరణిని దేశభక్తి, ధర్మనిష్ఠ వైపు మళ్ళించారని చెప్పారు. దేశంలోని ప్రచార యంత్రాంగానికి హిందూత్వం కేంద్ర బిందువు కావడానికి ఈయన చేసిన ప్రయోగాలు అనేకం సఫలమయ్యాయని వివరించారు.
రంగ హరి అసమాన ప్రతిభాపాటవాలు, ఒక సమస్యను చూసే వైఖరిని, దానికి చూపే పరిష్కారాన్ని విని తామంతా అబ్బురపడే వాళ్లమని తెలిపారు. రంగ హరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్పందిస్తూ.. రంగ హరి తన జీవితమంతా మానవత్వం, దేశ నిర్మాణం కోసం అంకితం చేశారని చెప్పారు. ఈయన జీవితం యువ స్వయం సేవకులకు ఎంతో ప్రేరణ ఇస్తుందని.. ఆయన ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.
మరోవైపు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) స్పందిస్తూ.. రంగ హరి మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.