రష్యా (Russia)-ఉత్తర కొరియా (North korea) ల మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశంపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్ రోవ్ వచ్చే నెలలో ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. అక్టోబర్ లో ఆయన ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ కు చేరుకుంటారని రష్యా రాయబారి తెలిపారు. ఇటీవల ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఈ పర్యటన ఉంటుందని న్యూయార్క్ లో ఆయన వెల్లడించారు.
ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటించారు. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ అయ్యారు. అనంతరం రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్జేయ్ షోగూతో సమావేశం అయ్యారు. రష్యాలోని మిస్సైల్ సిస్టమ్, ఫైటర్ జెట్లను తయారు చేసే పరిశ్రమలను కిమ్ పరిశీలించారు. ఈ భేటీపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళనలు వ్యక్తం చేసింది.
రష్యాకు ఆయుధాల సరఫరా చేసేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు నడిచినట్టు అమెరికా ఆరోపించింది. ఆ ఆయుధాలతో ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత తీవ్ర తరం చేయనున్నట్టు పేర్కొంది. భేటీ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను తమ దేశానికి రావాలని కిమ్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదట రష్యా విదేశాంగ మంత్రి ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్టు సమాచారం.