రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir putin) డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టారు. కొద్ది సేపటి క్రితం చైనా రాజధాని బీజింగ్‌లోని విమానాశ్రయంలో ఆయన దిగారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. దీంతో ఇరువురు నేతల భేటీ గురించి ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా చూస్తున్నాయి.
చైనా తన బెల్డ్ అంట్ రోడ్ ఇనిషియేటివ్ మొదలు పెట్టి పదేండ్లు అవుతున్న సందర్బంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 130 దేశాల సభ్యులతో ఓ ఫోరమ్ ను ఏర్పాటు చేసింది. ఆ జాబితాలో మొదటి ఆహ్వానితుడిగా పుతిన్ పేరును చేర్చి ఆయన్ని చైనాకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజింగ్ విమానాశ్రయానికి పుతిన్ చేరుకోగా ఆయనకు చైనా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఉక్రెయిన్-రష్యా యుద్దం మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు చైనాలో పర్యటించం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఆయన బీజింగ్ విమానాశ్రయంలో దిగినట్టు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. చైనా అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం అవుతారన్న విషయాన్ని అటు రష్యన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
ఇది ఇలా వుంటే ఉక్రెయిన్‌లో పిల్లలను బలవంతంగా రష్యా సైనికులు తమ దేశానికి తరలిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యుద్ద నేరాల కింద ఆయనపై కేసు నమోందైంది. దీంతో మార్చిలో పుతిన్ పై అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆయన పర్యటనలపై పరిమితులు విధించబడ్డాయి.