సచింద్ర నాథ్ సన్యాల్ (Shaheed Sachindra Sanyal).. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉక్కు పిడికిలి బిగించిన ఉద్యమ వీరుడు. భగత్ సింగ్ (Bagath Singh), చంద్రశేఖర్ ఆజాద్ ల గురువు. హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించి ఎంతో మందిని ఉద్యమ బాట పట్టించారు. భారత వైశ్రాయ్ లార్డ్ హార్జింజ్ పై రాజ్ బిహార్ ఘోష్ తో కలిసి దాడి చేశారు. కకోరీ కుట్ర కేసులో పాల్గొని అరెస్టయ్యారు. బ్రిటీష్ పై పోరాటంలో గాంధీ బాటను వ్యతిరేకించి ఉద్యమ బాటను కొనసాగించారు.
1890 ఏప్రిల్ 3న యూపీలోని వారణాసిలో జన్మించారు. తల్లిదండ్రులు హరినాథ్ సన్యాల్, ఖేరోడ్ వాసినీ దేవి. చిన్నతనం నుంచే విప్లవ పోరాటాల పట్ల ఆసక్తి కనబరిచారు. 1913లో అనుశీలన్ సమితి అనే విప్లవ సంస్థకు చెందిన శాఖను పాట్నాలో సన్యాల్ ఏర్పాటు చేశారు. బెంగాల్ విభజనను రద్దు చేసిన తర్వాత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని మార్పు సందర్భంగా ఢిల్లీకి వచ్చిన బ్రిటీష్ వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ పై రాజ్ బిహారీ ఘోష్ తో కలిసి సచింద్ర సన్యాల్ బాంబు దాడి చేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాజ్ బిహార్ ఘోష్ జపాన్ కు వెళ్లిన తర్వాత దేశంలో విప్లవ పోరాట యోధుల్లో అత్యంత సీనియర్ గా కొనసాగారు.
ఆ తర్వాత కకోరి కుట్ర కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధించింది. అండమాన్ లోని కాలాపానీ జైలుకు తరలించారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో మళ్లీ పోరాటం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్ అధికారులు అరెస్టు చేసి మళ్లీ అండమాన్ కు తరలించారు. అక్కడ టీబీ వ్యాధి సోకడంతో గోరఖ్ పూర్ కు తరలించారు. అక్కడి జైల్లో సన్యాల్ మరణించారు.