హైదరాబాద్‌లో ఘరానా మోసం బయట పడింది. మాదాపూర్‌లో చిట్టీల పేరిట మధ్యతరగతి ప్రజలకు ఓ చిట్ ఫండ్ (Chit Fund) సంస్థ మోసం చేసింది. ఏకంగా 200 కోట్లు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసింది. సమతా మూర్తి (Samath Murthy) చిట్ ఫండ్ కంపెనీ దెబ్బకు బాధితులు లబోదిబో మంటున్నారు.
వివరాల్లోకి వెళితే…..మాదాపూర్‌లో చిట్టీల పేరిట మధ్యతరగతి ప్రజలకు సమతా మూర్తి చిట్ ఫండ్ సంస్థ ఎర వేసింది. వారి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత ఎల్.బీ నగర్, మాదాపూర్, కూకట్ పల్లిలో బ్రాంచీలు తెరిచి మరీ వందల సంఖ్యలో కస్టమర్ల దగ్గర నుంచి చిట్టీలు వసూలు చేసింది.
అనంతరం కస్టమర్లకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఎగ్గొట్టింది. దీంతో రెండు నెలల క్రితం చిట్ ఫండ్ సంస్థపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బాధితులు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
దీనిపై సీపీ స్పందించి కేసు నమోదుకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ నిర్వాహకులైన శ్రీనివాస్, రాకేశ్ లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు సంస్థ డైరెక్టర్ గణేశ్, అకౌంటెంట్ జ్యోతి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.