కేసీఆర్ (KCR) పార్టీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ (BRS) లో లుకలుకలు మొదలయ్యాయి. ఎవరు ఉంటారో.. ఎవరు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కొందరు రాజీనామాల బాట పట్టారు. టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula veeresham) బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
కార్యకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన వేముల.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీమానా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను, తన అనుచరులను కేసులతో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు. అంతకుముందు, బీఆర్ఎస్ పార్టీకి గుడై బై చెప్పారు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ (Santhosh Kumar). పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారు.
2018లో ఎటువంటి పదవీ ఆశించకుండా బీఆర్ఎస్ లో చేరానని, పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎటువంటి అవకాశం లభించలేదని.. తన రాజకీయ భవిష్యత్తు నిమిత్తం బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కలిసి రావాలని సీఎం పిలుపుతో తాను కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీలో చేరానని… కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కరీంనగర్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సంతోష్ కుమార్ 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ సమయంలో శాసనమండలిలో ఆయనతోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ గూటికి వెళ్లడంతో.. మండలిలో కాంగ్రెస్ గుర్తింపును రద్దు చేశారు చైర్మన్. అప్పటినుంచి ఇప్పటిదాకా సంతోష్ కు ఎలాంటి పదవి దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అయినా ఇస్తారని అనుకుంటే.. అదీ జరగలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
రెండు రోజుల క్రితం నల్లా మనోహర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పెద్దపల్లి టికెట్ దాసరి మనోహర్ రెడ్డికే కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా పార్టీలో ఉంటూ కష్టపడ్డానని.. అయినా, పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన చెందారు. మంత్రి కేటీఆర్ కు తొమ్మిదేళ్లుగా ప్రధాన అనుచరుడుగా ఉన్నా కూడా అన్యాయం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని చెప్పారు.