సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) కు సుప్రీం కోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు, తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై ఎప్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై స్పందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, ఉదయనిధి స్టాలిన్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ నెల 2న ‘సనాతన ధర్మాన్ని నిర్మూలన కార్యక్రమం’ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీలతో పోల్చాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపు నిచ్చారు. ఉదయ్ నిధి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ సమావేశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మద్రాసు హైకోర్టుకు చెందిన అడ్వకేట్ ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదయ్ నిధి వ్యాఖ్యలపై విచారణ జరిపించేలా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మానం విచారణ చేపట్టింది.
ఈ విషయంలో మద్రాసు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని పిటిషన్ దారున్ని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి పలు పిటిషన్లు ఇప్పటికే సుప్రీం కోర్టు ధర్మాసనం ఎదుట పెండింగ్ లో వున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వమే పలానా మతానికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెబుతోందని, రెండు రోజుల క్రితం ఈ మేరకు అధికారులు సర్క్యులర్ కూడా జారీ చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదని పిటిషనర్ ధర్మాసనాన్ని ఆశ్రయించడన్నారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వానికి, ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.