అయోధ్య (Ayodhya)లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేత వార్షికోత్సవం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చి వేశారు. ఆ సమయంలో తీవ్ర హింస చెలరేగింది. వేలాది మంది ఈ ఘటనలో మరణించారు.
నేటికి బాబ్రీ మసీదు కూల్చివేతకు 31 ఏండ్లు పూర్తవుతోంది. అయోధ్యకు వచ్చి పోయే వారిని సీసీటీవీల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని ఆపి వారి ఐడెంటిటీ కార్డ్సు ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు వాహనాల తనిఖీలను కూడా చేపట్టారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించే అసత్య ప్రచారాలు, వదంతులకు దూరంగా ఉండాలని ప్రజలను సీనియర్ ఎస్పీ రాజ్ కరణ్ నాయర్ వెల్లడించారు. అయోధ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం అలర్ట్ గా ఉందన్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీ కాస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను అయోధ్యకు తరలించామన్నారు. సైబర్ విభాగంతో పాటు కమ్యూనికేషన్ పోలీసులు యాక్టివ్ గా పని చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు, రెచ్చ గొట్టే పోస్టులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.