Telugu News » ISRO : మన రాకెట్ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా అడిగింది….!

ISRO : మన రాకెట్ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా అడిగింది….!

అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రాకెట్ల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.

by Ramu

చంద్రయాన్-3 (Chandrayan-3) స్పేస్ క్రాఫ్ట్ పని తీరును చూసిన తర్వాత ఆ రాకెట్ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా నిపుణులు భారత్ ను కోరుతున్నారని భారత అంతరిక్ష కేంద్రం (ISRO)చీఫ్ ఎస్. సోమనాథ్ అన్నారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రాకెట్ల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.

చంద్రయాన్‌-3లో ఉపయోగించిన టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు అమెరికా నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం 92వ జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. భారత్ ఇప్పుడు శక్తివంతమైన దేశం అని అన్నారు.

మన దేశంలో ఉన్న జ్ఞానం, మేథో స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని చెప్పారు, చంద్రయాన్ -3 లో తాము అంతరిక్ష నౌకను రూపొందించి అభివృద్ధి చేసిన సమయంలో తాము జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, నాసా నుంచి నిపుణులను ఆహ్వానించామన్నారు. తమ ఆహ్వానం మేరకు జేపీఎల్ నుంచి ఆరుగురు నిపుణులు బృందం భారత్ కు వచ్చిందని చెప్పారు.

ఆ సమయంలో వారికి చంద్రయాన్-3 గురించి వివరించామన్నారు. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ ను ఎలా డిజైన్ చేశామో వారికి పూర్తిగా అర్థమయ్యేలా వివరించామన్నారు. చంద్రయాన్-3 ను చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎలా ల్యాండ్ చేయబోతున్నామో వాళ్లకు కళ్లకు కట్టినట్టు చూపించామని అన్నారు. అప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ ను చూసి నాసా నిపుణులు ఆశ్చర్య పోయారన్నారు.

అత్యంత తక్కువ ధరలో స్సేస్ క్రాఫ్ట్ టెక్నాలజీని రూపొందించిన విధానంపై వారు ప్రశంసలు కురిపించారన్నారు. దాన్ని నిర్మించడం కూడా అత్యంత తేలికైన పని అని గుర్తించారన్నారు. దీంతో ఆ టెక్నాలజీని అమెరికాతో ఎందుకు పంచుకోకూడని నిపుణులు అడిగారన్నారు.

You may also like

Leave a Comment